దేవునికి కోపము వస్తే || దేవుని మాట || Gods Word In Telugu

దేవునికి కోపము వస్తే ..... 




“ దేవుని కోపము వారి మీదకు దిగెను . వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను . ఇశ్రాయేలులో యౌవనులను కూల్చెను " ( కీర్తనలు 78:31 ) 

కోర్టులో జడ్జి ఎవరికైనా ఉరి శిక్ష విధిస్తే అది ఆ వ్యక్తి మీద కోపముతో కాకుండా చట్ట ప్రకారం అతడు చేసిన తప్పుకి తగిన శిక్ష అవుతుంది . శిక్ష విధించ డానికి ముందు తగిన సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాతే శిక్ష విధిస్తాడు . ఇది భూమి మీద మనుష్యులు వారు వ్రాసుకున్న చట్టాల ప్రకారం , ఏ తప్పులకు ఏ శిక్ష విధించాలన్న దానిని బట్టి ఉంటుంది . 

అయితే దేవునికి చట్టాలతో , సాక్షులతో పని లేదు . మనుష్యులు చేసే పాపాలన్నీ హృదయాలను పరిశీలించే దేవునికి స్పష్టంగా కనబడుతుంటాయి . కాబట్టి దేవుడు మనుష్యులు చేసే పాపాలను బట్టి వారికి శిక్ష విధిస్తాడే తప్ప మనుష్యుల మీద వ్యక్తిగతమైన కోపమేమీ ఉండదు .

 ' నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు . దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును ' ( యెహెజ్కేలు 33:11 ) 

అని చెప్పిన దేవునికి మనుష్యుల మీద కోపము ఉంటుందా ? మరి దేవుడు ఎందుకు కోపపడతాడంటే , అన్యాయం , అక్రమం చేస్తే దేవుడు కోపపడతాడు . మనుష్యుల కోపము వ్యక్తిగతమైనది , వారి కోపము వారికి సంబంధించినదై ఉంటుంది . కాని దేవుని కోపము వ్యక్తిగతమైనది కాదు , ఆయన కోపము బాధితులకు సంబంధించినదై ఉంటుంది . మనుష్యుల మధ్యలో అశాంతిని రేపి సమాధానము చెడగొట్టే వారి మీద ఆయన కోపపడతాడు . ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది . 

ఆ ఒక్క నిమిషం చాలు ఆయన భూమిని నాశనం చేయడానికి . అయిన ప్పటికీ ఆయన కీడు చేయడానికి వెనకాడతాడు . ' నీవు కటాక్షమును , జాలియును , బహుశాంతమును , అత్యంత కృపయునుగల దేవుడవైయుండి , పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని ... ( యోనా 4 : 2 ) . ఇలాంటి లక్షణాలున్న దేవునికి కోపము వస్తే , అది ఖచ్చితంగా మనుష్యుల యొక్క దుర్మార్గతను దేవుడు భరించలేకపోవడమే . ఇంతగా ప్రేమించే దేవుని ప్రేమను గుర్తించకుండా అవిధేయతగా ఉండటం వలననే దేవుడు ఈ భూమి మీదకు అనేకమైన తెగుళ్ళను పంపించి మనుష్యులను నాశనం చేస్తున్నాడు .

 ప్రపంచాన్ని సర్వనాశనం చేసే తెగుళ్ళు రావడానికి కారణం మన అవిధేయతే . దుర్మార్గుడు నశించటం దేవునికి ఇష్టం లేకపోయినప్పటికీ , వారు మారడానికి దేవుడు అనేక అవకాశాలు కల్పించినప్పటికీ మారకపోవడం వలన తప్పనిసరి పరిస్థితులలో వారిని శిక్షించాల్సి వస్తుంది . మన ప్రవర్తన వలన దేవునికి కోపము పుట్టించకుండా మారుమనస్సు పొంది , దేవునికి విధేయత కలిగి జీవిద్దాము . ప్రభువా , మేము ఈ భూమి మీద జీవించినంత కాలము మా ప్రవర్తనతో నీకు కోపము పుట్టించకుండా నీకు విధేయత కలిగి జీవించేలా మాకు మారుమనస్సు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి . ఆమేన్ .

దేవునికి కోపము వస్తే || దేవుని మాట || Gods Word In Telugu దేవునికి కోపము వస్తే || దేవుని మాట || Gods Word In Telugu Reviewed by ALLINONE on May 19, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.