History Of The Book Of Psalms In Telugu || కీర్తనల గ్రంధం సంగ్రహ సమీక్ష

 కీర్తనల గ్రంధం సంగ్రహ సమీక్ష ♻️

the book of psalms in telugu 



I) కీర్తనల గ్రంధం — ఉపోద్ఘాతం 


II) కీర్తనల గ్రంధం — విభజన, వివరాలు


III) కీర్తనల గ్రంధం — ముఖ్యాంశాలు


A) బైబిల్లో ప్రసిద్ధి చెందిన ఇతర కీర్తనలు


B) దావీదును ప్రభావితం చేసిన కీర్తనలు


C) విశ్వాసులను ప్రభావితం చేసే కీర్తనలు


IV) కీర్తనల గ్రంథము నుండి సహాయము


V) కీర్తనల గ్రంథములో కీర్తనకారుల అనుభవాలు



✳️1. కీర్తనల గ్రంథం - ఉపోద్ఘాతము


ఇది కీర్తనలతో పొందుపరచబడిన గ్రంథం కాబట్టే ఈ గ్రంథానికి కీర్తనల గ్రంథం అనే పేరు పెట్టబడింది . అయితే ఈ గ్రంథానికి " స్తుతుల గ్రంథం " అని కూడా ( హెబ్రి భాషలో ) మరో పేరు ఉంది . మరో మాటలో స్తుతి కీర్తనల గ్రంథం . ఆదినాల్లో దేవుని ఆలయంలో దేవుని ప్రజలు , ఆయనను ఆరాధించుటకు ఉపయోగించిన పాటల పుస్తకం ఈ కీర్తనల గ్రంథం . ఇందులో 150 కీర్తనలు ఉన్నాయి . ( 150 అధ్యాయాలు కాదు సుమా ) ఈ కీర్తనల్లో దరిదాపు 73 కీర్తనలు , ఇశ్రాయేలు ప్రజల మధుర గాయకుడైన దావీదు వ్రాయడం వలన ఈ గ్రంథాన్ని చాలా మంది " దావీదు కీర్తనలు " అని కూడా పిలుస్తుంటారు . అయినా కీర్తనలు వ్రాసిన వారిలో ఇంకా ఏడుగురు రచయితలు కూడా ఉన్నారు కాబట్టి ఈ గ్రంథాన్ని కీర్తనల గ్రంథం అని అనడమే ఎంతైనా సమంజసం . 


💕 1. ఈ గ్రంథ ప్రత్యేకత : —


బైబిలు గ్రంథంలో అతి పెద్ద ( పాటల ) పుస్తకం కీర్తనల గ్రంథం . లోకంలో ఉన్న ప్రతి మానవుని జీవిత అనుభవాలకు తగినట్లుగా పొందుపరచి వ్రాయబడిన గ్రంథం - కీర్తనల గ్రంథం . ఈ గ్రంథం బైబిల్లోనే కేంద్ర ( మధ్య ) స్థానం వహించింది .


 💕 2. కీర్తనల గ్రంథం వ్రాయబడిన ఉద్దేశం : —


కీర్తనీయుడైన దేవునిని స్తుతించి , ఆరాధించుటతో పాటుగా , పాపపు ఒప్పుకోలు , పశ్చాత్తాప ప్రార్థనలను సహితం పద్యరూపంలో వ్యక్తపరచి దేవుని సహాయాన్ని పొందే విధానాన్ని తెలియజేయడం ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం . 


💕 3. కీర్తనల గ్రంథ రచయితలు :—


 1 ) దావీదు ( 73 ) , 

2 ) ఆసాపు ( 12 ) , 

3 ) కోరహుకుమారులు ( 11 ) ,     

 4 ) హిజ్కియా ( 10 ) , 

5 ) సాలోమోను ( 2 ) , 

6 ) మోషే ( 1 ) , 

7 ) హేమాను ( 1 ) , 

8 ) ఏతాను ( 1 ) . 

వీరు వ్రాసిన కీర్తనలు మొత్తం 111. ఇక మిగిలిన 39 కీర్తనల రచయితలు ఎవరో సరైన ఆధారాలు లేనప్పటికీ వీటిలో ఎక్కువ దావీదే వ్రాసి ఉండొచ్చని భావన . 


💕 4. కీర్తనల గ్రంథం వ్రాసిన కాలం :—


 క్రీ || పూ || 1440 - 586 సం || ల మధ్యలో అనగా సుమారు 800-1000 సం || ల కాలంలో వ్రాయబడినవి . 


💕 5. కీర్తనల గ్రంథంలో మూలకీర్తనలు :— 


50 , 150 కీర్తనలు . 


💕 6. కీర్తనల గ్రంధ మూల వాక్యం :—


 " సకల ప్రాణులు యెహోవాను  స్తుతించుదురు గాక ! యెహోవాను స్తుతించుడి " కీర్తన 150 : 6 .


💕  7. కీర్తన గ్రంథ మూల భావం :— 


 క్రీస్తు ( మెస్సీయా ) . 


💕 8. కీర్తన గ్రంథంలో ముఖ్యాంశం :—


 “ రాజు , రాజ్యం " . 


💕 9. కీర్తన గ్రంథంలో మూలపదం :—


 “ హల్లెలూయా " " PRAISE THE LORD " . ప్రభువును స్తుతించుడి . 


ఈ కీర్తనల గ్రంథం గత కొన్ని శతాబ్దాలుగా ఎంతో మంది హృదయాలను రంజింపచేస్తూ , అనేక మనస్సులను దేవునివైపు ఆకర్షింపచేస్తూ , మనుష్యుల జీవితాలను సహితం దేవునిలోనికి నడిపిస్తూ ఉంది . ఒక వ్యక్తి బలహీనమై ఇంటిలో , పడకలో లేక అనారోగ్యాన్ని బట్టి ఆసుపత్రిలో ఉన్నపుడో , ఒక ప్రత్యేకమైన సమస్యతో ఎంతో వత్తిడికి గురి అయినపుడో , ఇలా భౌతికంగా , మానసికంగా ఆధ్యాత్మికంగా ప్రతి ప్రతికూల పరిస్థితిలోను , ఆయారీతులుగా సహాయపడగల , బహుధైర్యపరచి , ఆదరించగల గ్రంథం కీర్తనల గ్రంథం .


⭕ అంబ్రోస్ అనే ఒక దైవజనుడు కీర్తనల గ్రంథం " సంఘస్వరాలు " అన్నాడు .   

 జాన్ కెల్విన్ అనే గొప్ప భక్తుడు “ ఇది ఆత్మావయవాలను పరిశోధించగల గ్రంథం " అని వక్కాణించాడు . 


ఇది లేఖనాలన్నిటికి ఒక తోట వంటిది . ఈ తోటలో ఎన్నో సందర్భాలకు తగిన లేఖన ఫలాలను కోసుకోవచ్చు . పాత నిబంధనలోను , క్రొత్త నిబంధనలోను ఉదహరించబడిన 219 ప్రత్యేక వాక్య సందర్భాల్లో 116 వాక్యాలు ఈ కీర్తన గ్రంథంలోనివే . హెర్డ్ అనే భక్తుడు “ ఈ గ్రంథం అన్ని కాలాలకు , సమయ సందర్భాలకు తగిన పాటల పుస్తకం ” అన్నాడు . అవును , ఈ గ్రంథంలో యూదులకు సంబంధించిన అన్వయాలు ఎన్నో ఉన్నా .... . దేవుని ప్రజల సార్వత్రికతను తెలియజేసే విధంగా వారి హృదయాల్లో కీర్తనల గ్రంథం ప్రముఖ స్థానం వహించింది . తరాలన్నిటిలోనూ దేవునియందు విశ్వసించిన వారి హృదయానుభవాలను తెలియజేస్తుంది కీర్తనల గ్రంథం . 


ఈ కీర్తనలు క్రీస్తుతో నింపబడి ఉన్నాయి . నిజానికి సువార్తల్లో కంటే కీర్తనల్లోనే ఆయన గురించిన సంపూర్ణ వివరణ కన్పిస్తుంది . సువార్తల్లో , " ఆయన ప్రార్థించుటకు కొండపైకి వెళ్ళెను " అని వ్రాయబడితే , కీర్తనల్లో ఆయన ఏమని ప్రార్థించాడో తెలియజేయబడింది .

సువార్తలు - " ఆయన సిలువ వేయబడ్డాడు " అని చెబితే , కీర్తనలు - సిలువ వేసే సమయంలో ఆయన హృదయపు లోతుల్లో నుండి ఏమి వెడలి వచ్చాయి , ఎటువంటి బాధను అనుభంచాడు అనేది ఒక ప్రత్యక్ష దృశ్యంలా వర్ణించి చెబుతాయి . సువార్తలు " ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు అని తెలియజేస్తే .... " సువార్తలు చెప్పి ముగించిన దగ్గర్నుండి ఈ కీర్తనలు మిగిలిన విషయాలు అనగా " ఆయన పరలోకంలో సింహాసనాసీనుడైనాడు " అనే వరకు సత్యాన్ని వివరిస్తాయి . ఇలా కీర్తనల్లో ఆయన్ని గురించి వ్రాయబడిన సంగతి లూకా 24:44 లో ప్రభువు తన శిష్యులకు జ్ఞాపకం చేసినట్లు చూడగలం .


 ⭕ నిజానికి కీర్తనల్లో స్తుతించడం ఉంది అంటే అది కేవలం ఆయన్ని బట్టే . ఆయనే స్తుతిలో ప్రధానంశం . అవును కీర్తనల గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండగా , ఇది క్రీస్తు గ్రంథం అన్న సత్యం మనకు స్పష్టమవుతుంది . క్రైస్తవ హృదయాంతరంగానికి హత్తుకు పోయిన గ్రంథం , ప్రపంచ వ్యాప్తంగా , సార్వత్రిక క్రైస్తవ సంఘ స్తుతి ఆరాధనలకు ఆధారమైన గ్రంథం , క్రైస్తవ సంగీత సాహిత్యానికి అంకురార్పణ చేసిన గ్రంథం " కీర్తనల గ్రంథం " . ఈ కీర్తనల్లో దేవున్ని స్తుతించేందుకు , స్తుతించమని ప్రరేపించేందుకు , లేక కృతజ్ఞతాస్తుతులు చెల్లించేందుకు ఆధారమైన కీర్తనలు సుమారు అరవైమూడు ( 63 ) నుండి డెబ్బైమూడు ( 73 ) వరకు ఉన్నా , ఈ కీర్తనల ఆధారంగా క్రైస్తవ సంగీత ప్రపంచంలో వందలాది భాషల్లో వేలాది రాగాల్లో లక్షలాది పాటలు , కోట్లాది మంది ప్రజలు పాడి , ప్రభువును కొనియాడి , ప్రభువునందు సంతోషించడానికి ఆధారమైనది ఈ కీర్తనల గ్రంథం . 


ఇలా ఈ కీర్తనలు , కృతజ్ఞతాస్తుతి ఆరాధన , ప్రార్థనలే ప్రధానాంశంగా వ్రాయబడినా , దేవుడు తన ప్రజల పట్ల , లేదా శత్రువుల పట్ల వ్యవహరించే తీరును గురించి ; దేవుడు , దేవుని బిడ్డలు , దేవుని నివాసస్థలం , దేవుని మందిరం , దేవుని పరిపాలన గురించి కూడా కొన్ని కీర్తనలు వ్రాయబడ్డాయి . ఇక ఈ కీర్తనల్లో విశ్వాసులకు సంబంధించి వారు ఎదుర్కొనే ప్రతి పరిస్థితి , సందర్భానికి తగినట్లు అన్వయించుకొని ఆదరించబడడానికి , ధైర్యపరచబడడానికి , హెచ్చరించబడటానికి ప్రోత్సహించబడటానికి వీలుగా ఏదో ఒక కీర్తన తప్పనిసరిగా ఉపకరించబడటం ఈ కీర్తనల గ్రంథ ప్రత్యేకత . 


సేకరణ


కీర్తనీయుడైన క్రీస్తు కృపా కనికరములు సదా మీకు తోడైయుండును గాక ! ఆమెన్ !!

History Of The Book Of Psalms In Telugu || కీర్తనల గ్రంధం సంగ్రహ సమీక్ష History Of The Book Of Psalms In Telugu ||  కీర్తనల గ్రంధం సంగ్రహ సమీక్ష Reviewed by ALLINONE on May 21, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.