మీకు తెలుసా ? || యేసు క్రీస్తు చేసిన అద్భుతములు || Miracles Done by jesus in telugu

 యేసు క్రీస్తు చేసిన అద్భుతములు 



✳️ ప్రభువు రూపాంతరము చెందుట 


ఆరు దినములైన తరువాత యేసు పేతురును... యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట బెట్టుకొని యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి యెదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాట లాడుచుండిరి. అప్పుడు పేతురు ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది; నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమాన మైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారియొద్దకు వచ్చి వారిని ముట్టిలెండి, భయపడకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా, యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్యకుమారుడు మృతులలోనుండి లేచువరకు ఈ దర్శనము మీరు ఎవరి తోను చెప్పకుడని యేసు వారి కాజ్ఞాపించెను. మత్తయి 17: 1-9


❇️ ప్రభువు, శిష్యుల ఎదుట రూపాంతరం చెందుట 


మానవునిగా పుట్టిన ప్రభువు, సామాన్య మానవుడు కాదు. ఆయన మానవ ఆకారం దాల్చిన దేవుడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,3 ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునై యున్నాడు. (హెబ్రీ 1:3) ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. ( కొలస్సి 1:15) దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది (కొలస్సి 2:9) ఈ విషయాన్ని గ్రహించాలనే ఆయన వారి ఎదుట రూపాంతరం చెందారు.


❇️ ఆయన ముఖము సూర్యునివలే ప్రకాశించుట 


ఆయన నిజంగానే నీతిసూర్యుడు. ఆయన పుట్టుకకు 400 సంవత్సరాలకు పూర్వమే మలాకీ ప్రవక్త ప్రవచించారు. నా నామమందు భయ భక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును (మలాకీ 4:2) సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడైయున్నాడు. (1 తిమోతి 6:16)


❇️ ప్రభువు రూపాంతరం పొందేసమయంలో ముగ్గురు శిష్యులనే ఎందుకు తీసుకు వెళ్లారు? 


పేతురు, యాకోబు, యోహాను అను ముగ్గురు శిష్యులు ప్రభువుకు అత్యంత సన్నిహితంగా వుండడానికి యిష్టపడేవారు. ఈ సందర్భములోనే కాదు, యాయీరు కుమార్తెను బ్రతికించినప్పుడు కూడా, ప్రభువుతోపాటు ఈ ముగ్గురినే గదిలోనికి తీసుకువెళ్లారు. గెత్సేమనే తోటలోకూడా ఈ ముగ్గురు శిష్యులనే వెంటబెట్టుకొని వెళ్లి, చింతాక్రాంతుడవడానికి మొదలుపెట్టారు. ఇట్లాంటి అనుభవాలన్నీ వారికెట్లా సాధ్యమయ్యాయి అంటే, ప్రభువుకి వారికిని గల మధ్యగల సన్నిహితమైన సంబంధమే. మనము కూడా పాపపు గోడను ఛేదించి, ప్రభువుతో సన్నిహితంగా జీవించడానికి మన హృదయాలను సిద్ధపరచుకో గలగాలి.


❇️ ఎత్తైన కొండమీద ప్రభువు మహిమను చూచిన శిష్యులు: 


ఆధ్యాత్మిక పర్వతానుభవాలు మన జీవితంలో వుండగలగాలి. అవి మనలను లోకాశాలకు దూరంగాను, ప్రభువుకు సమీపముగాను చేర్చగలుగుతాయి. ప్రభువుతో గడపగలిగే ఏకాంతపు అనుభవాలు మనలను ఆయనయొక్క సమరూపములోనికి మార్చగలుగుతాయి.

లోకాశాలకు, భ్రమలకు, ఆకర్షణలకు దూరముగా వుంటూ పరలోకసంబంధమైన వాటివైపు దృష్టిసారించగలిగితేనే, ఆయనకు సమీపముగా చేరి, ప్రభువు యొక్క మహిమను చూడగలము.


❇️ ప్రభువు రూపాంతరము పొందు సమయంలో మోషే, ఏలీయాలు రావడానికి గల కారణం? 


మోషే ధర్మ శాస్త్రానికిని, ఏలీయాలు ప్రవక్తలకును ప్రతినిధులుగానున్నారు. వారిరువురు ప్రభువును గురించి ముందుగానే ప్రవచించారు. యూదులైతే ధర్మశాస్త్రం, ప్రవక్తలు ప్రవచించిన “మెస్సియా” యేసు క్రీస్తు కాదని, ఆయన ధర్మ శాస్త్రానికి విరుద్ధమైన కార్యాలు చేస్తున్నారని, ఆయనను నిరాకరించారు. అందుచే, యూదులకు గ్రహింపు కలుగులాగున, ప్రభువు రూపాంతరం పొందుసమయంలో వారే వచ్చి, ప్రభువుతో మాట్లాడారు.


❇️ పేతురు చేసిన మరొక పొరపాటు 


పేతురు ” ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది; నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను”. మోషే, ఏలీయాలను ప్రభువుతో సమానముగా ఎంచుతున్నాడు. వారిరువురు మనుష్యులు. దేవునికి చెందాల్సిన మహిమను, మనుష్యులకు ఆపాధించకూడదు. నేటిదినాల్లో కూడా యిదే పరిస్థితి కొనసాగుతుంది. రెండవదిగా, మనము ఈ కొండపైనే వుండి పోదాము అంటున్నాడు. ప్రభువు కొరకు ఎంతోమంది ఎదురు చూస్తుండగా, పరిచర్య ఎంతో మిగిలియుండగా యిక్కడే వుండిపోదాము అనడం, భాద్యతలను, కర్తవ్యాలను మరచినట్లే అవుతుంది. అట్లా జరగడానికి వీల్లేదు.


❇️ ఈయన మాట వినుడి: 


పేతురు ఈ కొండమీదే వుండిపోదామంటూ, ప్రభువుకు సలహాలిస్తున్న సమయంలో, అతనిమాటలు ఇంకా ముగించకముందే, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. అవును! మనము కూడా, అనేక సందర్భాలలో పేతురువలే దేవునికే సలహాలిచ్చే ప్రయత్నం చేస్తుంటాము. ప్రార్ధిస్తున్నప్పుడు కూడా ఇట్లా జరగాలి ప్రభువా అంటూ, ఎట్లా జరగాలోకూడా మనమే నిర్ణయించేస్తుంటాము. అది మన జీవితాలకు శ్రేయస్కరము కాదు. ఆయన చిత్తానికి అప్పగించి, ఆయన మాట వినాలి. ఆయన మాటకు లోబడాలి. మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునైయుండుడి. (యాకోబు 1:22) ఆరీతిగా మన జీవితములను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!


 నేస్తమా దేవుని కోసం పోరాడుదాం




మీకు తెలుసా ? || యేసు క్రీస్తు చేసిన అద్భుతములు || Miracles Done by jesus in telugu మీకు తెలుసా ? ||  యేసు క్రీస్తు చేసిన అద్భుతములు  || Miracles Done by jesus in telugu Reviewed by ALLINONE on May 21, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.